BSE: 1600 పాయింట్లు పడిపోయి, రూ. 6 లక్షల కోట్ల నష్టంలో స్టాక్ మార్కెట్!

  • శుక్రవారం నాడు 5 వేల పాయింట్ల ర్యాలీ
  • నేడు ఆరంభంలోనే భారీ నష్టాలు
  • 9,500 దిగువకు జారిపోయిన నిఫ్టీ
Stock Market Widens Loss

స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయని, ర్యాలీ నమోదైందని భావించిన ఇన్వెస్టర్ల ఆనందం, ముచ్చటగా, మూడు రోజులు కూడా మిగల్లేదు. ఈ ఉదయం సెషన్ ప్రారంభం కాగానే, బెంచ్ మార్క్ సూచికలు ఘోరంగా నష్టపోయాయి. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సున్నా శాతానికి చేయడం, 150 దేశాలకు పైగా కరోనా విస్తరించడం వంటి అంశాలు భవిష్యత్ ఆర్థిక వృద్ధిని కుదేలు చేస్తాయన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి.

దీంతో ఈక్విటీల కొనుగోళ్ల కన్నా, అమ్మకాలకే పెట్టుబడిదారులు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఈ ఉదయం 10.20 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే, 1625 పాయింట్లు పడిపోయి 4.77 శాతం నష్టంతో 32,478 పాయింట్లకు చేరింది. మదుపరుల సంపద సుమారు రూ. 7 లక్షల కోట్లకు పైగా హారతి కర్పూరం అయింది.

ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 455 పాయింట్లు పడిపోయి 4.58 శాతం నష్టంతో 9,449 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50లో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఎస్ బ్యాంక్, బీపీసీఎల్, టీసీఎస్, సన్ ఫార్మాలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. దీంతో శుక్రవారం నాటి సెషన్ లో కనిపించిన సూపర్ ర్యాలీ కారణంగా వచ్చిన లాభం హరించుకుపోయినట్లయింది.

ఇక ప్రపంచ మార్కెట్ల విషయానికి వస్తే, నిక్కీ దాదాపు స్థిరంగా నిలువగా, స్ట్రెయిట్స్ టైమ్స్ 3.19 శాతం, హాంగ్ సెంగ్ 2.19 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 3.07 శాతం, కోస్పీ 1.90 శాతం, సెట్ కాంపోజిట్ 4.80 శాతం, జకార్తా కాంపోజిట్ 3.49 శాతం, షాంగై కాంపోజిట్ 0.55 శాతం నష్టపోయాయి.

More Telugu News