Jyothi: చైనాలో కరోనా గురించి భయంకర నిజాలు చెప్పిన జ్యోతి!

  • మనుషులు రోడ్లపై పడిపోయేవారు
  • మధ్య వూహాన్ లో పరిస్థితి ఘోరం
  • ఒంటరిగా ఉండలేక భయపడిపోయాను
  • ఇండియాకు వచ్చిన తరువాత జ్యోతి
Jyothi Revels Shocking Facts in Wuhan

చైనాలో కరోనా మరణ మృదంగం సృష్టించిన, వూహాన్ నగరంలో చిక్కుకుని పోయి, ఎంతో ప్రయాస తరువాత, ఇండియా చేరి, రెండు వారాల పాటు అబ్జర్వేషన్ లో ఉండి, ఆపై ఇంటికి చేరుకున్న జ్యోతి, తనకు ఎదురైన భయంకర అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జ్యోతి, చైనాలో ఉద్యోగ శిక్షణార్థం వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బయటకు వచ్చిన తరువాత, వూహాన్ కు ఇండియా నుంచి ప్రత్యేక విమానం వెళ్లగా, జ్యోతికి జ్వరంగా ఉండటంతో, ఆమెను పంపేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు.

ఆపై ఆమె పదేపదే చేసిన విజ్ఞప్తుల మేరకు భారత ప్రభుత్వం స్పందించగా, న్యూఢిల్లీకి ఆమెను తీసుకుని వచ్చారు. ఆపై 14 రోజుల పాటు క్వారంటైన్ చేసి, ఎటువంటి వైరస్ లక్షణాలూ లేవని తేల్చి ఇంటికి పంపారు.

ఇక చైనాలోని పరిస్థితులను వివరించిన, ఆమె, ఎంతో మంది వైరస్ బారిన పడి చనిపోయారని, అదో భయానక అనుభవమని పేర్కొంది. ప్రజలు అకస్మాత్తుగా నేలపై పడి పోయేవారని, వారిని కాపాడేందుకు సైన్యం ప్రయత్నించేదని తాను చూసిన దృశ్యాలను వివరించారు. వీధులన్నీ నిర్మానుష్యం అయిపోయాయని, ముఖ్యంగా మధ్య వూహాన్ నగరంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయని వెల్లడించింది. తాను చైనా అధికారులు అందించే ఆహారం తినలేకపోయానని, డార్మిటరీలో ఒంటరిగా పడుకోలేక ఎంతో భయపడ్డానని జ్యోతి వెల్లడించింది.

ఇండియాకు తిరిగి వెళ్తానని తాను భావించలేదని, భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడే తనను స్వదేశానికి చేర్చిందని వెల్లడించింది. జ్యోతి మాట్లాడిన మాటల వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News