ఇది మనదేశంలో పుట్టింది కాదు... దీనిపై భయోత్పాతం చెందాల్సిన అవసరం లేదు: సీఎం కేసీఆర్

14-03-2020 Sat 22:06
  • కరోనాపై సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశం
  • కరోనా బాధితుల్లో తెలంగాణ వాసులెవరూ లేరని వెల్లడి
  • వైరస్ పై పోరాటానికి రూ.500 కోట్లు మంజూరు
CM KCR says no need to panic about corona
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ విస్తృతిపై క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కరోనా మనదేశంలో పుట్టిన వ్యాధి కాదని, చైనాలో జన్మించి అక్కడి నుంచి ఇతర దేశాలకు పాకుతోందని అన్నారు. దీనిపై భయోత్పాతానికి లోనవ్వాల్సిన అవసరం లేదన్నారు. కరోనా బాధితుల్లో తెలంగాణ వాసులెవరూ లేరని కేసీఆర్ వెల్లడించారు.

కేంద్రం నుంచి తమకు అందిన సమాచారం ప్రకారం, దేశంలో 83 మందికి కరోనా సోకిందని, వారిలో 66 మంది భారతీయులు కాగా, మిగతావాళ్లు విదేశీయులని వివరించారు. ఈ 66 మంది భారతీయులు కూడా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినవాళ్లేనని తెలిపారు. ఇప్పటివరకు 10 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారని, మిగతావాళ్లకు చికిత్స జరుగుతోందని అన్నారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో ఇది 83 మందికే సోకిందని, అందునా మరణాల సంఖ్య రెండేనని, దీనిపై ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు.

కరోనాపై పోరుకు ఎంత ఖర్చయినా చేస్తామని, అయితే ప్రస్తుతానికి క్యాబినెట్ రూ.500 కోట్లు ప్రాథమికంగా మంజూరు చేసిందని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

ఇక, ఇంటర్, పదో తరగతి పరీక్షలు, ఎంట్రన్స్ టెస్టులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. జనసమూహాలు ఉన్న చోటుకు వ్యక్తులు వెళ్లడాన్ని తగ్గించాలని సూచించారు.