Telangana: ప్రజా ప్రతినిధులు ఫోన్ చేస్తే ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడం తప్పే.. క్షమాపణ చెబుతున్నా: మంత్రి పువ్వాడ అజయ్

  • ఆర్టీసీపై మండలిలో మాట్లాడిన మంత్రి 
  • సంస్థకు రోజుకు కోటిన్నర లాభం వస్తోందన్న అజయ్
  • నెలాఖరుకు వంద కార్గో బస్సులు సిద్ధం చేస్తామని ప్రకటన
telangana transport minister puvvada ajay kumar apologyses

ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేస్తే ఆర్టీసీ అధికారులు ఎత్తకపోవడం, వారికి సమాధానం ఇవ్వకపోవడం తప్పే అని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇందుకు గురువారం శాసన మండలిలో మంత్రి క్షమాపణ చెప్పారు. ఆర్టీసీ గురించి ఈ రోజు మండలిలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేస్తే ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘ఆర్టీసీ అధికారులు.. ప్రజా ప్రతినిధుల ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, వారికి సమాచారం అందివ్వకపోవడం తప్పే. అందుకు క్షమాపణ చెబుతున్నా’ అన్నారు.

 ఆర్టీసీకి రోజుకు రూ. కోటిన్నర లాభం వస్తోందని తెలిపారు. ఈ నెల చివరకు వంద కార్గో బస్సులు సిద్ధం చేస్తామన్న మంత్రి.. ఆర్టీసీ పార్సిల్ సర్వీసుల ద్వారా  ఏటా రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇక సమ్మె కాలపు జీతాలు రూ. 235 కోట్లు చెల్లించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారని, ఆర్టీసీ జేఏసీ నాయకులే సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారని అజయ్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించామన్నారు. వారికి ఇవ్వాల్సిన సీసీఎస్, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం రూ. 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని మంత్రి చెప్పారు.

More Telugu News