Enforcement Directorate: రాణా కపూర్ వ్యవహారంలో.. ప్రియాంక గాంధీని ప్రశ్నించనున్న ఈడీ?

  • యెస్ బ్యాంక్ రాణా కపూర్‌‌కు ఆమె అమ్మిన పెయింటింగ్ సీజ్ 
  • తాను ఇచ్చిన రెండు కోట్లతో సిమ్లాలో ప్రియాంక కాటేజ్ కొన్నట్టు
    ఈడీకి  రాణా కపూర్‌‌ వాంగ్మూలం
  • ఈ విషయంలో ప్రియాంకకు ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం
ED likely to quiz Priyanka Gandhi over Rana painting

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చిక్కుల్లో పడ్డారు. యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌‌కు రెండు కోట్లకు పెయింటింగ్ విక్రయించిన విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఆమెను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ప్రియాంక నుంచి ఈ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మిలింద్ దేవరా తనపై ఒత్తిడి తెచ్చారని ఈడీకి రాణా కపూర్ వాంగ్మూలం ఇచ్చారు. పెయింటింగ్ కోసం తాను ఇచ్చిన రెండు కోట్లతో ప్రియాంక సిమ్లాలో కాటేజ్ కొనుగోలు చేసిందని చెప్పారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఓ కేసులో నిందితుడి నుంచి తీసుకున్న డబ్బుతో ప్రియాంక కొనుగోలు చేసిన కాటేజ్‌ను ‘నేరం ద్వారా వచ్చిన ఆదాయం’గా పరిగణించాల్సి ఉంటుందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆస్తిని తమ అధీనంలోకి తీసుకునే అధికారం ఈడీకి ఉంటుందని  అంటున్నారు.

కపూర్‌‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రియాంకకు త్వరలోనే సమన్లు జారీ చేయడంతో పాటు సిమ్లాలోని కాటేజ్‌ను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రియాంక నుంచి రాణా కపూర్ కొనుగోలు చేసిన పెయింటింగ్‌ను  సీజ్‌ చేసినట్టు ఎన్ఫోర్స్‌మెంట్ (ఈజీ) అధికారులు ప్రకటించారు. ముంబైలోని రాణా కపూర్‌‌ నివాసం నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు 

ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తాను గీసిన చిత్రపటాన్ని 1985లో కాంగ్రెస్‌ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజీవ్ గాంధీకి బహూకరించారు. అయితే, 2010లో దీన్ని ప్రియాంక గాంధీ రెండు కోట్లకు రాణా కపూర్‌‌కు విక్రయించారు. ఈ పెయింటింగ్‌ను కొన్నందుకు ధన్యవాదాలు చెబుతూ రాణా కపూర్‌‌కు అప్పట్లో ప్రియాంక లేఖ రాశారు.

అయితే, ఈ మధ్యే యెస్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకుంది. బ్యాంకు కార్యకలాపాల్లో ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో రాణా కపూర్‌‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ లేఖ బయటకు రావడంతో కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. దేశంలో ఎలాంటి అర్థిక నేరం జరిగినా దానితో గాంధీ కుటుంబానికి సంబంధాలుంటాయని ఆరోపిస్తోంది.

More Telugu News