India: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక

Team India set to play three ODI matches against SA
  • మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్
  • పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్య
  • గాయం కారణంగా జట్టుకు ఎంపిక కాని రోహిత్ శర్మ
  • షమీకి విశ్రాంతి
ఐపీఎల్ తాజా సీజన్ కు ముందు టీమిండియా పురుషుల జట్టు దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 12 నుంచి 18వ తేదీ వరకు భారత్ లోని పలు వేదికల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. తాజాగా ఈ సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తాడు. గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మను జట్టుకు ఎంపిక చేయలేదు. ఇటీవల ధనాధన్ ఇన్నింగ్స్ లతో మోతమోగిస్తున్న హార్దిక్ పాండ్య జట్టులోకి పునరాగమనం చేశాడు. ధావన్, పృథ్వీ షా ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశాలున్నాయి. పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. వెటరన్ ఆటగాడు కేదార్ జాదవ్ ను పక్కనబెట్టారు.

ఇక, దక్షిణాఫ్రికా జట్టు ఈ సిరీస్ కోసం నేడు భారత్ బయల్దేరింది. సూపర్ ఫామ్ లో ఉన్న జేన్ మాన్ మలాన్ కు అనూహ్యరీతిలో తుదిజట్టులో స్థానం కల్పించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అద్భుత సెంచరీ చేసిన జట్టును గెలిపించిన మలాన్ ను 16వ ఆటగాడిగా జట్టుకు ఎంపిక చేశారు. వాస్తవానికి భారత్ కోసం ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో మలాన్ ను తీసుకోలేదు. తన రెండో వన్డేలోనే విధ్వంసక ఆటతీరు కనబర్చడంతో చివరినిమిషంలో భారత్ టూర్ కు ఎంపిక చేశారు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మార్చి 12న ధర్మశాలలో, రెండో వన్డే మార్చి 15న లక్నోలో, చివరిదైన మూడో వన్డే మార్చి 18న కోల్ కతాలో జరగనున్నాయి.

జట్టు సభ్యులు వీరే...

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్ మాన్ గిల్.

India
South Africa
ODI Series
Dharmashala

More Telugu News