ఆ ప్రకటన చేసింది నేను కాదు.. సోషల్ మీడియాలోకి రాను: నటుడు అజిత్

08-03-2020 Sun 08:38
  • సోషల్ మీడియాలోకి వస్తున్నట్టు వచ్చిన ప్రకటన అవాస్తవం
  • ఆ ప్రకటనకు, అజిత్‌కు ఎటువంటి సంబంధం లేదు
  • ఆ ప్రకటన విడుదల చేసిన వారిపై చర్యలు తప్పవన్న నటుడి తరపు న్యాయవాదులు
Actor Ajith Kumar issues statement clarifying rumours of him joining social media
కోలీవుడ్ నటుడు అజిత్ త్వరలో సోషల్ మీడియాలోకి రాబోతున్నాడంటూ ఇటీవల వైరల్ అయిన వార్తలో ఎంతమాత్రమూ నిజం లేదని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలోకి రావాలని భావిస్తున్నట్టు అజిత్ పేర్కొన్నట్టుగా ఆయన సంతకాలతో కూడిన ఓ ప్రకటన ఈ నెల 6న విడుదలైంది. ఆ తర్వాత కాసేపటికే అది వైరల్ అయింది. అది చూసిన అజిత్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

అయితే, అది నకిలీ ప్రకటన అని అజిత్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఆరో తేదీన వచ్చిన ప్రకటనలో అజిత్ సంతకాలు చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. ఆ ప్రకటనలో ఉన్న విషయం పూర్తిగా అవాస్తవమని, అజిత్‌కు, ఆ ప్రకటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అది విడుదల చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో అజిత్‌కు ఎటువంటి ఖాతాలు లేవన్నారు. నిజానికి సామాజిక మాధ్యమాల్లోకి రావడం అజిత్‌కు ఇష్టం లేదని పేర్కొన్నారు.