Corona Virus: ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన కరోనా కేసులు.. 3400కు పెరిగిన మరణాలు

Corona Virus Cases raised to One Lakh over the Globe
  • ఒక్క చైనాలోనే 3070 మంది మృతి
  • 90 దేశాలకు విస్తరించిన ప్రాణాంతక వైరస్
  • కరోనా దెబ్బకు ప్రపంచ మార్కెట్ల మూత
కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటేసింది. మరణించిన వారి సంఖ్య 3400కు పెరిగింది. చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పటి వరకు 90 దేశాలకు పైగా విస్తరించింది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియాలు  బాధిత దేశాలుగా మారాయి. కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లతోపాటు మక్కా మసీదు, బెత్లహాంలోని నేటివిటీ చర్చి వంటి ప్రముఖ దర్శనీయ స్థలాలను మూసివేశారు.

ఇక, కొన్ని ఈవెంట్లు కూడా రద్దయ్యాయి. ఒలింపిక్స్, ఐపీఎల్ వంటి మెగా క్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకోగా, నేపాల్‌లో ఈ నెల 14న ప్రారంభం కావాల్సిన ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) వాయిదా పడింది. గూగుల్ సహా టెక్ దిగ్గజాలు కూడా తమ ఈవెంట్లను వాయిదా వేసుకున్నాయి.

గతంతో పోలిస్తే చైనాలో కరోనా నిర్ధారిత కొత్త కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కొత్తగా 99 మందికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించగా, 28 మంది మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఒక్క చైనాలోనే 3070కి చేరుకుంది. దక్షిణ కొరియాలో 174 మందికి కొత్తగా వైరస్ సోకింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6767కు చేరుకుంది. 44 మంది మృతి చెందారు. ఇరాన్‌లో కరోనా మరణాల సంఖ్య 124కు పెరగ్గా, బాధితుల సంఖ్య 4747కు చేరుకుంది. ఇటలీలో 4636 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, 197 మంది మృతి చెందారు. భారత్‌లో 31 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.
Corona Virus
corona deaths
Corona cases
China
Iran
Italy
India

More Telugu News