China: రోడ్లపై శవాలున్న వీడియోలు అన్నీ నకిలీవే.. వూహాన్ లో చదువుతున్న భారత వైద్య విద్యార్థి!

  • వూహాన్ లోని రోడ్లు ఎడారిని తలపిస్తున్నాయి
  • జనవరి 23 వరకు అందరూ రోడ్లపై ఫ్రీగా తిరిగారు
  • ఆ తర్వాత చైనీయులు మాతో కలవకుండా నిషేధించారు
Videos Of Dead Bodies Were Fake says Indian Student Who Returned From Wuhan

చైనాలోని వూహాన్ నగర రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయని, ప్రైవేట్ వాహనాలు ఎక్కడా కనిపించడం లేదని, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కూడా దాదాపుగా నిలిచిపోయిందని చైనాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థి ఆశిష్ కుర్మే తెలిపాడు. వూహాన్ సమీపంలోని మెడికల్ కాలేజీలో అతను ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మహారాష్ట్రలోని లాతూరు జిల్లాకు చెందిన ఆశిష్... కరోరా కల్లోలం చెలరేగిన తర్వాత భారత ప్రభుత్వం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చినవారితో పాటు ఇండియాకు వచ్చాడు. భారత్ కు వచ్చిన తర్వాత 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి, తాజాగా తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో, చైనాలోని పరిస్థితులను అతను పంచుకున్నాడు.

'డిసెంబర్ 8న తొలి కరోనా కేసును గుర్తించారు. కరోనా వైరస్ కేసులు నమోదైన తొలి రోజుల్లో వూహాన్ నగరంలో ప్రజలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కరోనా ప్రబలిన తర్వాత జనవరి చివరి వారంలోనే దాని గురించి మాకు తెలిసింది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిన తర్వాత లాక్ డౌన్ ప్రకటించారు.

వూహాన్ రోడ్లపై శవాలు ఉన్నట్టున్న వీడియోలు నిజం కాదు. అవి ఫేక్ వీడియోలు. ఈ వీడియోల గురించి నాకు ఇండియాకు వచ్చిన తర్వాతే తెలిసింది. వూహాన్ లో జనవరి తొలి వారం నుంచే ప్రజల శరీర ఉష్ణోగ్రతలను టెస్ట్ చేయడం ప్రారంభించారు. అప్పట్లో మేము ఫ్రీగా తిరిగాం. జనవరి 23 వరకు నేను కూడా మర్కెట్ కు, స్నేహితుల ఇళ్లకు వెళ్లేవాడిని. జనవరి 23న లాక్ డౌన్ ప్రకటించడంతో, ప్రజలు రోడ్లపైకి రావడం ఆగిపోయింది. అందరూ ఎవరి ఇళ్లలో వారు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందరి అవసరాలను తీర్చే పనిని ప్రభుత్వ సిబ్బంది చేపట్టారు. మా పరిసర ప్రాంతాల్లోకి చైనా జాతీయులు రావడాన్ని నిషేధించారు.

మాకు అధికారులు మాస్కులు ఇచ్చారు. లాక్ డౌన్ తర్వాత క్రమం తప్పకుండా మా ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసేవారు. క్రమంగా అక్కడి పరిస్థితులు దారుణంగా మారడంతో... ఇండియాకి తిరిగి వచ్చేయాలని అనుకున్నా. అయితే వూహాన్ ఎయిర్ పోర్టును మూసేశారనే విషయం మాకు అప్పుడు తెలిసింది.

బీజింగ్ లోని ఇండియన్ ఎంబసీ మాకు అన్ని ఏర్పాట్లు చేసింది. వారు మా యూనివర్శిటీకి ఒక బస్సును పంపించారు. ఆ బస్సులో ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. రోడ్లపై ప్రభుత్వాధికారులు, పోలీసు బృందాలు మాత్రమే కనిపించాయి. ప్రతి ఒక్కరి విషయంలో వారు చాలా జగ్రత్తలు తీసుకున్నారు. విమానాశ్రయంలో మమ్మల్ని దాదాపు 30 ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత విమానంలోకి అనుమతించారు.

ఇండియాలో దిగిన తర్వాత 14 రోజుల పాటు నన్ను క్వారంటైన్ లో ఉంచి, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. ఆ తర్వాత ఇంటికి పంపించారు. 15 సంవత్సరాల క్రితం చైనాను కుదిపేసిన సార్స్ తో పోలిస్తే... కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య చాలా తక్కువే.

లాక్ డౌన్ తర్వాత చైనా రోడ్లు ఎడారిని తలపించాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ స్తంభించిపోయింది' అంటూ ఆశిష్ తన అనుభవాలను చెప్పుకొచ్చాడు.

More Telugu News