Nirbhaya: ఈ దఫా శిక్ష అమలు ఖాయమే... నలుగురికీ ఉరి తప్పదంటున్న న్యాయ నిపుణులు!

  • ఇప్పటికే మూడు సార్లు శిక్ష అమలు వాయిదా
  • తాజాగా మార్చి 20న ఉరి తీయాలని డెత్ వారెంట్
  • నిందితుల వద్ద మిగలని చట్ట పరమైన అవకాశాలు
Nirbyaha Convicts Death Warrent on March 20

మార్చి 20, ఉదయం 5.30 గంటలు...!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకూ ఆ రోజు మరణదండన అమలు చేస్తారు. ఇక ఎటువంటి పరిస్థితులలోనూ ఆగే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ శిక్షను తప్పించుకునేందుకు ఒకరి తరువాత ఒకరు తమకున్న చట్ట పరమైన దారులను వాడుకుంటూ రాగా, ఇప్పటికే అవన్నీ మూసుకుపోయి, డెత్ వారెంట్ కూడా జారీ అయింది. ఉరి తేదీని ఖరారు చేయాలంటూ పటియాలా హౌస్ కోర్టును ఢిల్లీ సర్కారు అభ్యర్థించగా, మార్చి 20న ఉరి తీయాలంటూ, అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా వారెంట్ ను జారీ చేశారు.

ఈ కేసులో దోషిగా ఉన్న పవన్ కుమార్ ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు క్షమాభిక్ష పిటిషన్ ను పెట్టుకోవడం, ఆ వెంటనే రాష్ట్రపతి దాన్ని తిరస్కరించడం తెలిసిందే. ఇక కోర్టు తాజా డెత్ వారెంట్ పై నిర్భయ తల్లి మాట్లాడుతూ, 20వ తేదీన తమ జీవితాల్లో వెలుగు వస్తుందని భావిస్తున్నానని, వారి మరణాన్ని చూడాలని తన మనసు కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ చట్టంలోని లొసుగులను వారు వాడుకున్నారని, ఇక వారికి ఆ అవకాశం లేదని అన్నారు. వారిని ఉరి తీస్తే, భారత న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు.

కాగా, నిర్భయ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం సవాలు చేయగా, దీనిపై విచారణ జరగనుంది. ఓ కేసులో దోషులుగా తేలితే, వారందరికీ ఒకేసారి శిక్ష అమలుపై మరోసారి విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. ఇకపై వాయిదాలు లేకుండా కేసులో తుది తీర్పును వెల్లడిస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో 20వ తేదీ సూర్యోదయాన్ని నిందితులు చూసే అవకాశాలు లేవని తెలుస్తోంది.

More Telugu News