Rahul Sipligunj: మొదట రితేశ్ రెడ్డి నాపై చేయి చేసుకున్నాడు: రాహుల్ సిప్లిగంజ్

  • అమ్మాయిని వేధిస్తుండడంపై ప్రశ్నించానని వెల్లడి
  • తనకు న్యాయం చేయాలని డిమాండ్
  • ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోనన్న సిప్లిగంజ్
Rahul Sipligunj tells how the attackers hit him at a pub

ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై ఓ పబ్ లో దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఓ అమ్మాయిని కొందరు యువకులు వేధిస్తుండడాన్ని ప్రశ్నించిన రాహుల్ పై ఈ దాడి జరిగినట్టు ప్రాథమిక సమాచారం. దీనిపై రాహుల్ స్వయంగా వివరణ ఇచ్చారు. కొందరు రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన స్నేహితురాల్ని మాటలతో వేధిస్తున్న ముగ్గుర్ని తాను నిలదీశానని, అయితే మాటలు పెరగడంతో రితేశ్ రెడ్డి అనే యువకుడు తనను కొట్టాడని రాహుల్ వెల్లడించారు.

రాహుల్ సిప్లిగంజ్ లాంటి సెలబ్రిటీని కొట్టాం అని చెప్పుకోవడానికే రితేశ్ రెడ్డి తదితరులు ఈ దాడి చేసినట్టు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఘటన సమయంలో ఇద్దరు బౌన్సర్లు ఉన్నా వారు నిస్సహాయుల్లా మిగిలిపోయారని తెలిపారు. ఈ విషయంలో తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం పట్ల ఎంతో ఆగ్రహం కలుగుతోందని, కానీ కొన్ని విషయాలు మీడియా ముందు మాట్లాడలేకపోతున్నానని అన్నారు.

రితేశ్ రెడ్డి వాళ్ల అన్న టీఆర్ఎస్ పార్టీ నేత అని తెలిసిందని, అయినా తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పబ్ లో జరిగిన దాడి సమయంలో తాను ఆవేశానికి లోనవడం నిజమేనని అన్నారు. కాగా, మీడియా సమావేశంలో కెమెరాలు క్లోజప్ షాట్ చిత్రీకరించిన సమయంలో రాహుల్ ముఖంపై గాయాలు స్పష్టంగా కనిపించాయి.

More Telugu News