Perni Nani: ‘వైఎస్ఆర్ జగనన్న' కాలనీలుగా నామకరణం చేస్తాం: ఏపీ మంత్రి పేర్ని నాని

Minister Perni Nani explains AP Cabinet Decisions
  • ఉగాది పండగ రోజున ఇళ్ల స్థలాల పంపిణీ  
  • రాష్ట్రంలోని 26 లక్షల మంది పేదలకు ఇస్తాం
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై చార్జిషీట్ దాఖలుకు ప్రత్యేక ప్రక్రియ 
రాష్ట్రంలోని పేదలకు ఉగాది పండగ రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించామని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో నాని మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు.

ప్రభుత్వ భూములతో పాటుగా, ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని, యుద్ధ ప్రాతిపదికన లే–అవుట్లు ఏర్పాటు చేసి, గ్రావెల్ రోడ్లు నిర్మించి పేదలకు స్థలాలు ఇవ్వనున్నామని, ఈ కాలనీలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలపై పూర్తి హక్కు లబ్ధిదారులకే ఉంటుందని, ఇల్లు కట్టుకునేందుకు లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆ పట్టాలను ఐదేళ్ల పాటు బ్యాంకులో తనఖా పెట్టుకునే హక్కు వారికి కల్పిస్తున్నామని అన్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేసే నిమిత్తం తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తున్నట్టు వివరించారు.
 
ఈ సందర్భంగా కేబినెట్ చేసిన పలు తీర్మానాలను, లభించిన ఆమోదాలను తెలిపారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)  పక్రియను నిలిపివేయాలని కేబినెట్ తీర్మానం చేసిందని చెప్పారు. ఏపీ స్టేట్ సీడ్ కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు బ్యాంకుల నుంచి తీసుకొచ్చేందుకు, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లోని 800 మెగా వాట్ల విద్యుత్ కేంద్రం, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను పూర్తి చేసేందుకు రూ.1000 కోట్ల రుణం తీసుకునేందుకు, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం సుండిపెంట గ్రామపంచాయతీ ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం మేరకు అక్కడ నాలుగు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు, 44 పోస్టులు భర్తీ చేసేందుకు, అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట జరిగిన అక్రమాలపై చార్జిషీట్ దాఖలు చేసే నిమిత్తం ప్రత్యేక ప్రక్రియ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని నాని వివరించారు.
Perni Nani
YSRCP
Andhra Pradesh
cabinet
Meet

More Telugu News