Bonda Uma: ఏపీలో విక్రయిస్తున్న ఈ చెత్త మద్యం బ్రాండ్స్​ దేశంలో ఎక్కడైనా ఉన్నాయా?: జగన్​ సర్కార్​ పై బోండా ఉమ ఫైర్​

  • హానికరమైన బ్రాండ్స్ ను జగన్ ప్రభుత్వం విక్రయిస్తోంది
  • హైదరాబాద్ లో పేమెంట్.. తాడేపల్లిలో ఇండెంట్
  • జగన్ సర్కార్ రూ.300 కోట్ల పైచిలుకు కమీషన్లు కొట్టేసింది
TDP Leader Bonda Uma lashes out Jagan government

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి రాకముందు ప్రచారం చేసుకున్న జగన్ అధికారంలోకొచ్చాక లిక్కర్ ని ఆదాయవనరుగా చేసుకున్నారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్స్ ను తన టేబుల్ పై ఒక వైపు, టీడీపీ హయాంలో విక్రయించిన బ్రాండ్లను మరోవైపు వరుసగా పెట్టుకుని, బోండా ఉమ ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి హానికరమైన బ్రాండ్స్ ను తన ‘J-ట్యాక్స్’ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తోందని, ‘హైదరాబాద్ లో పేమెంట్.. తాడేపల్లిలో ఇండెంట్ జరుగుతోందని విమర్శించారు. కేవలం, మద్యంపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.300 కోట్ల పైచిలుకు కమీషన్లు కొట్టేసిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో మద్యం దుకాణాలకు ఇచ్చిన ధరల పట్టికను, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలకు ఇచ్చిన ధరల పట్టికల ప్రతులను విలేకరులకు చూపించారు.

కమీషన్ల కోసం పేదోడి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు

రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకే ధరలు పెంచామని చెబుతున్న ప్రభుత్వం, ‘చెత్త మద్యాన్ని, కల్తీ మద్యాన్ని.. ప్రజలకు పూర్తిగా హానికరమైన మద్యాన్ని’ సప్లయ్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘జార్డీస్ బార్’ బ్రాండ్ విస్కీ, ‘బూమ్’ బీరును విక్రయిస్తున్నారని అన్నారు. మన దేశంలోనే కాదు జగన్ కు ఇష్టమైన దక్షిణాఫ్రికా దేశంలో కూడా ఈ బ్రాండ్ కనబడదని విమర్శించారు. ప్రతి బీరు కేసుకు ఒక రేటు, చీప్ లిక్కర్ కు మరో రేటు, ప్రీమియం లిక్కర్ కు ఇంకో రేట్ పెట్టి తమ కమీషన్ల కోసం పేదోడి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటూ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.గత అరవై, యాభై ఏళ్లుగా ఉన్న ‘సీగ్రమ్స్’,‘యూబీ’.. మొదలైన మద్యం బ్రాండ్స్ ను తమ హయాంలో విక్రయించామని, దేశంలో ఎక్కడికెళ్లినా ఈ బ్రాండ్స్ దొరుకుతాయని చెప్పారు. కానీ, జగన్ బ్రాండ్ బూమ్ బీరు, పిచ్చి విస్కీలు ఎక్కడా దొరకవని అన్నారు. కేవలం డబ్బు పిచ్చితో ఉన్న జగన్ ప్రభుత్వం, కార్మికుల వీక్ నెస్ ని ఆధారంగా చేసుకుని ఇలాంటి పిచ్చి బ్రాండ్స్ ను విక్రయిస్తోందని అన్నారు.

More Telugu News