Virat Kohli: కోహ్లీ ఫెయిల్యూర్ పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
- కోహ్లీ తన కంటి చూపుపై కేర్ తీసుకోవాలి
- బ్యాటింగ్ ప్రాక్టీస్ ను పెంచాలి
- కొంచెం ముందుగానే బంతిని స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఉంది
న్యూజిలాండ్ టూర్ లో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ ను స్వీప్ చేసిన టీమిండియా... ఆ తర్వాత జరిగిన వన్డే, టెస్టు సిరీసుల్లో చేతులెత్తేసింది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో ఎన్నడూ లేని విధంగా వైఫల్యం చెందాడు. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ లలో కోహ్లీ కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో, కోహ్లీని విమర్శకులు టార్గెట్ చేశారు. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వయసు వచ్చిన తర్వాత కంటిచూపు, శరీరం స్పందించే తీరు నెమ్మదిస్తాయని ఆయన అన్నారు.
'నీవు ఒక వయసుకు చేరుకున్న తర్వాత... ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత నీ కంటి చూపులో తేడా వస్తుంది. వాస్తవానికి ఇన్ స్వింగర్ డెలివరీలను కోహ్లీ బౌండరీలకు తరలిస్తుంటాడు. అదే అతని బలం. కానీ ఇప్పుడు అదే విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే కోహ్లీ తన కంటి చూపుపై కేర్ తీసుకోవాలి. ఒక గొప్ప బ్యాట్స్ మెన్ ఎవరైనా సరే ఇన్ కమింగ్ డెలివరీకి బౌల్డ్ కావడమో లేదా ఎల్బీడబ్లూ కావడమో జరుగుతోందంటే... అతను మరింత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని అర్థం. ఈ విధంగా ఔట్ అవుతున్నాడంటే... కంటి చూపు, శరీరం స్పందించే తీరులో తేడా వచ్చిందని అర్థం. వీటిని వెంటనే సరిదిద్దుకోవాలి. లేదంటే నీ బలం నెమ్మదిగా బలహీనతగా మారుతుంది.
18 నుంచి 24 ఏళ్ల వయసు వరకు కంటి చూపు నార్మల్ గా ఉంటుంది. ఆ తర్వాత నీ చూపు నీవు తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుంది. సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, వివియన్ రిచర్డ్స్ వీరంతా కూడా తమ కెరీర్ లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నవారే.
బ్యాటింగ్ కు సంబంధించి కోహ్లీ ప్రాక్టీస్ ను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. కోహ్లీ టైమింగ్ లో తేడా వచ్చింది. బంతిని కొంచెం ఆలస్యంగా స్ట్రైక్ చేస్తున్నాడు. కొంచెం ముందుగానే బంతిని స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి కోహ్లీకి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. త్వరలో జరగనున్న ఐపీఎల్ అతనికి చాలా ఉపయోగపడుతుంది' అని కపిల్ దేవ్ తన అభిప్రాయాలను వెల్లడించారు.