‘అన్న‌పూర్ణ‘ నాణ్యమైన భోజనం అందిస్తోంది: మంత్రి తలసాని

02-03-2020 Mon 20:11
  • హైదరాబాద్ లో అన్న‌పూర్ణ భోజన పథకం ప్రవేశపెట్టి ఆరేళ్లు పూర్తి
  • సోమేశ్ కుమార్‌, హ‌రే కృష్ణ ఫౌండేష‌న్ లకు అభినందనలు
  • ఈ పథకాన్ని ద‌శ‌ల‌వారీగా న‌గ‌రంలో విస్తరించాం
Minister Talasani appreciates Annapurna scheme

హైదరాబాద్ నగరంలో అన్న‌పూర్ణ భోజన ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఆరు సంవ‌త్స‌రాలు పూర్తయింది. ఈ సందర్భంగా అమీర్‌పేట్‌లో నిర్వ‌హించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప‌శు సంవ‌ర్థ‌క, ఫిష‌రిస్‌, డైరీ డెవ‌ల‌ప్‌మెంట్‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, స్థానిక కార్పోరేట‌ర్ ఎన్‌.శేషుకుమారి, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అరవింద్ కుమార్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డీఎస్ లోకేశ్‌ కుమార్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్ బి.సంతోష్‌, ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ప్రావీణ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా మొబైల్ అన్న‌పూర్ణ భోజ‌న ప‌థ‌కాన్ని సోమేశ్ కుమార్‌ ప్రారంభించారు. 


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, అన్న‌పూర్ణ ప‌థ‌కాన్ని రూపొందించిన సోమేశ్ కుమార్‌ను, నాణ్య‌మైన భోజ‌నాన్ని అందిస్తున్న హ‌రే కృష్ణ ఫౌండేష‌న్ ల‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. ఐదు రూపాయలకే నాణ్య‌మైన భోజ‌నాన్ని అందిస్తున్న అన్న‌పూర్ణ ప‌థ‌కం దేశ‌ వ్యాప్తంగా గుర్తింపు పొందింద‌ని అన్నారు. సోమేశ్ కుమార్ గ‌తంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఉన్న సమయంలో ఈ ప‌థ‌కానికి  శ్రీ‌కారం చుట్టారని,  2014 మార్చి 1న నాంప‌ల్లి  రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.అప్పుడు 8 కేంద్రాల‌తో రోజుకు 2,500 మందికి ఈ పథకం ద్వారా భోజనం అందించామని అన్నారు. ఈ పథకాన్ని ద‌శ‌ల‌వారీగా న‌గ‌రంలో 150 కేంద్రాల‌కు విస్తరించడం ద్వారా ప్ర‌తిరోజు 30,000 నుండి 35,000 మంది ఆక‌లిని తీరుస్తోందని వివరించారు. అమీర్‌పేట కేంద్రంలో అత్య‌ధికంగా ప్ర‌తిరోజు 1200 మంది ఆక‌లిని ‘అన్నపూర్ణ’ తీరుస్తోందని,   కార్మికులు, పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువ‌గా ప్ర‌యోజ‌నం పొందుతున్న‌ట్లు తెలిపారు.

పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక ప‌ద్ధతిలో మోడ‌ల్ మార్కెట్లు, ఫుట్‌పాత్‌లు, వీధిలైట్లు, వైట్‌టాపింగ్ రోడ్లు, వైకుంఠ‌ ధామాలు అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధి చెందుతోందని, అందుకు అనుగుణంగా ప్ర‌భుత్వం మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తున్నామని అన్నారు.

 4 కోట్ల భోజ‌నాల మైలురాయిని చేరుకున్నాం: సోమేశ్ కుమార్


హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆక‌లితో ఏ వ్య‌క్తి ఇబ్బంది ప‌డకూడదని ప్ర‌భుత్వం ఆకాంక్షిస్తోందని సోమేశ్ కుమార్ అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు అప్ప‌టి వ‌ర‌కు 55 చోట్ల నిర్వ‌హిస్తున్న అన్న‌పూర్ణ కేంద్రాల సంఖ్య‌ను 150 కు పెంచిన‌ట్లు తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష‌, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు,  జీహెచ్ఎంసీ కృషితో అన్న‌పూర్ణ ప‌థ‌కం ద్వారా 4 కోట్ల భోజ‌నాల మైలురాయిని చేరుకున్న‌ట్లు వివరించారు. దేశంలో ఆర్థికాభివృద్ధి ప‌డిపోయిన‌ప్ప‌టికీ  తెలంగాణలో కేసీఆర్ చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో అభివృద్ధి బాగుంద‌ని ప్రశంసించారు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్దిలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం ఉంద‌ని, అందుక‌ని పేద‌ల ఆక‌లిని తీర్చేందుకు ఈ ప‌థ‌కాన్ని రూపొందించిన‌ట్లు వివ‌రించారు.

బిచ్చగాడు కూడా తాను యాచించిన పది రూపాయల్లో ఐదు రూపాయలతో తన  ఆక‌లి తీర్చుకొని, మిగిలిన ఐదుతో మ‌రో వ్య‌క్తి ఆక‌లిని తీర్చిన సంఘ‌ట‌న‌లు త‌న దృష్టికి వ‌చ్చాయని, మాన‌వ‌త‌కు హ‌ద్దు లేద‌ని అన్న‌పూర్ణ ప‌థ‌కం నిరూపించిందని సంతోషం వ్యక్తం చేశారు. 2000లో అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ గా తాను ప‌నిచేస్తున్న సమయంలో పుట్ట‌ప‌ర్తి సాయిబాబాతో తనకు సాన్నిహిత్యం ఏర్ప‌డిందని, అప్ప‌టి నుండి నిరుపేద‌ల ఆక‌లిని తీర్చాలన్న ఉద్దేశంతో దేవాల‌యాల‌లో అన్న‌దాన కార్యక్రమాలకు చేయూత‌గా నిలుస్తున్నానని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా తాను ప‌ని చేస్తున్న‌ప్పుడు హ‌రేరామ హ‌రేకృష్ణ ఫౌండేష‌న్ వారు ఉస్మానియా ఆసుప‌త్రిలో పేషెంట్స్ స‌హాయ‌కుల‌కు ఉచితంగా భోజ‌నం అందించే కార్య‌క్ర‌మానికి త‌న‌ను ఆహ్వానించారని, దీని ప్రభావంతోనే అన్న‌పూర్ణ ప‌థ‌కాన్ని ఆనాడు రూపొందించానని వివరించారు.