అమరావతి భూములను వెనక్కి ఇచ్చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పారు... దీనిపై కన్నా ఏమంటారు?: వెల్లంపల్లి

02-03-2020 Mon 19:00
  • టీడీపీ నేతలు సదావర్తి భూములు దోచుకున్నారని ఆరోపణ
  • దీనిపై కన్నా టీడీపీ నేతలను ఎందుకు నిలదీయడంలేదన్న వెల్లంపల్లి
  • ఏదో ఒక ఘటన అంటగట్టాలని ప్రయత్నిస్తున్నాడంటూ కన్నాపై ఆగ్రహం
AP minister Vellampalli fires on Kanna Lakshminarayana

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఏదో ఒక ఘటనను ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనలో చర్యలు తీసుకున్నా గానీ, కావాలనే ఈ ఘటనపై కన్నా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. సదావర్తి భూములను టీడీపీ నాయకులు దోచుకుంటుంటే కన్నా ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. అమరావతి భూములను వెనక్కి ఇచ్చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారని, దీనిపై కన్నా ఏమంటారని ప్రశ్నించారు. బీజేపీని కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ జనతా పార్టీగా మార్చేశారని, దానికి సుజనా చౌదరి అధ్యక్షుడని వెల్లంపల్లి విమర్శించారు. కన్నా ఇప్పుడు సుజనా చౌదరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారని ఆరోపించారు.