Tirumala: ఇలా వెళ్తే అలా దర్శనం... తిరుమల వెళ్లే భక్తులకు ఏపీటీడీసీ బంపరాఫర్!

  • మూడు గంటల్లోనే స్వామి దర్శనం
  • తిరుచానూరులో భారీ వసతి సముదాయం
  • రోజుకు 2 వేల మందికి దర్శనం
  • వెల్లడించిన ఏపీటీడీసీ అధికారులు
New Package for Tirumala Piligrims from APTDC

గంటల కొద్దీ నిరీక్షణ, కంపార్టుమెంట్లలో వేచి చూస్తూ ఇబ్బందులు లేకుండా, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. కొండపైకి వెళ్లిన తరువాత గరిష్ఠంగా మూడు నుంచి నాలుగు గంటల్లోనే వీరికి దర్శనం కలుగుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి దగ్గరలో నిర్మించిన ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వసతి సముదాయంలో రూమ్ బుక్ చేసుకోవడమే. ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్న వారిలో రోజుకు 2 వేల మందిని తిరుమలకు తీసుకుని వెళ్లి, వారికి త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, సంస్థకు చెందిన బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, తిరుచానూరులో బస చేసే వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరికి సొంతంగా వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆపై తిరుమలకు తీసుకుని వెళ్లి, స్వామి దర్శనం చేయిస్తామని అన్నారు.

ఇందుకోసం రూ. 70 కోట్లతో తిరుచానూరులో 7 అంతస్తుల భవనంగా నిర్మించిన 'పద్మావతి నిలయం'ను అద్దెకు తీసుకోవడం జరిగిందన్నారు. ఏటా కోటి రూపాయల అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఈ వసతి సముదాయాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ తీసుకోవడం గమనార్హం. ఈ బిల్డింగులో 80 ఏసీ, 120 నాన్ ఏసీ రూములుంటాయి. వీటిల్లో అన్ని సదుపాయాలతో పాటు, గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంటుంది. వచ్చే నెల తొలి వారంలో ఈ భవంతి ప్రారంభం కానుంది.

విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కుంభకోణం, మైసూరు తదితర ప్రాంతాల నుంచి, ఏపీటీడీసీ అందించే వివిధ ప్యాకేజీలను తీసుకుని వచ్చే దాదాపు 1000 మందికి ఇక్కడే బస అందించి, ఆపై దర్శనం చేయిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భక్తులు ఆన్ లైన్ లో ముందస్తు బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీటీడీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News