New Delhi: నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ.. 27కు చేరిన మృతుల సంఖ్య

  • ఉద్రిక్తతలు చల్లార్చేందుకు రంగంలోకి దిగిన కేంద్రం
  • సైన్యాన్ని దింపాలని కోరిన కేజ్రీవాల్
  • పోలీసులకు చీవాట్లు పెట్టిన సుప్రీంకోర్టు
Delhi Death toll raised to 27

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం భయంభయంగా గడుపుతున్నారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రంగంలోకి దిగిన కేంద్రం.. పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు అప్పగించింది. బుధవారం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది.

ప్రతిపక్షాల విమర్శలు

ఢిల్లీ అల్లర్లపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చూస్తుంటే ఇవి గుజరాత్ అల్లర్లను తలపిస్తున్నాయని సీపీఎం పేర్కొంది. ఢిల్లీ అల్లర్ల గురించి మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వాలంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాష్ట్రపతికి లేఖ రాశారు.  మరోవైపు, ఢిల్లీ అల్లర్లపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టింది.

కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలు  

ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉందని, నియంత్రించడం పోలీసుల వల్ల కాకపోవడంతో సైన్యాన్ని దించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నిన్న పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన హింసలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ రతన్‌లాల్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 106 మందిని అరెస్ట్ చేశారు. 18 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోదరభావంతో మెలగాలని సూచించారు. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ట్వీట్ చేశారు.

More Telugu News