Secunderabad: సరిగ్గా అర్ధరాత్రి 12:30కు బాంబు పేలుతుంది.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు!

Fake bomb call to Secunderabad Railway station
  • గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్
  • పరుగులు పెట్టిన పోలీసులు.. విస్తృత తనిఖీలు
  • ఫేక్ కాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గత అర్ధరాత్రి ఫోన్‌కాల్ కలకలం రేపింది. స్టేషన్‌లో బాంబు పెట్టామని అది సరిగ్గా అర్ధరాత్రి 12:30 గంటలకు పేలుతుందని పోలీస్ కంట్రోల్ రూముకు ఫోన్ రావడంతో గోపాలపురం,  సికింద్రాబాద్‌ జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు పరుగులు పెట్టారు. స్టేషన్‌లో విస్తృతంగా గాలించారు. అణువణువూ పరిశీలించారు.

అలాగే, స్కూటర్ పార్కింగ్ ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేశారు. ప్రయాణికుల వెయిటింగ్ హాలు, ఫుడ్ స్టాళ్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు జరిపింది. చివరికి బాంబు లేదని తేలడంతో పోలీసులు, ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు గత పది రోజుల్లో వచ్చిన రెండో బెదిరింపు ఫోన్ కాల్ కావడం గమనార్హం.
Secunderabad
Railway station
Bomb

More Telugu News