భార్యను కాపురానికి పంపడం లేదని అక్కసు.. ఆమె మేనమామ ప్రాణాలు తీసిన కర్కోటకుడు

22-02-2020 Sat 08:56
  • సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఘటన
  • భార్య మేనమామను కారుతో తొక్కించి చంపిన నిందితుడు
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
crime held in Nereducherla
భార్యను కాపురానికి పంపడం లేదన్న అక్కసుతో ఓ వ్యక్తి భార్య మేనమామ ప్రాణాలు బలిగొన్నాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల శ్రీదేవి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆరెపడి సుజరాజు భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు పొడసూపడంతో శ్రీదేవి ఈ నెల 18న పుట్టింటికి వచ్చేసింది.

భార్యకు నచ్చజెప్పి తీసుకెళ్లేందుకు గురువారం సుజైరాజు నేరేడుచర్ల వచ్చి వెళ్లాడు. శుక్రవారం మరోమారు వచ్చిన నిందితుడు భార్యను తనతో పంపాలని కోరాడు. అయితే, ఇప్పుడే పంపబోమని, వివాదం పరిష్కారమయ్యే వరకు ఆమె ఇక్కడే ఉంటుందని శ్రీదేవి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుజైరాజు తన చిన్న కుమార్తెను కారులో ఎక్కించాడు.

గమనించిన శ్రీదేవి మేనమామ శంకర్ (31) కారును అడ్డుకుని ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సుజైరాజు అతడిని గుద్దుకుంటూ కారును ముందుకు పోనిచ్చాడు. శంకర్ బానెట్‌పై ఉండగానే కారును హుజూర్‌నగర్ వైపు పోనిచ్చాడు. అక్కడ శంకర్‌ను కిందపడేసి కారుతో తొక్కించాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.