టెస్టు సమరానికి సిద్ధమైన టీమిండియా, న్యూజిలాండ్
- శుక్రవారం నుంచి తొలి టెస్టు
- వేదికగా నిలుస్తున్న వెల్లింగ్టన్ బేసిన్ రిజర్వ్
- సత్తా చాటేందుకు తహతహలాడుతున్న కీలక ఆటగాళ్లు
తొలి టెస్టు కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రాక్టీసు మ్యాచ్ లో అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్ మెన్ రాణించడం సానుకూలాంశం. రేపట్నించి జరిగే మ్యాచ్ లో ఇషాంత్, ఉమేశ్ లలో ఒకరికి చోటు లభించే అవకాశం ఉంది. షమీ, బుమ్రాలకు తుదిజట్టులో చోటు ఖాయం. స్పిన్నర్ కోటాలో అశ్విన్ స్థానానికి ఢోకా లేదు.
ఇక ఆతిథ్య జట్టు విషయానికొస్తే, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ పునరాగమనం చేయడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. భారత సంతతి స్పిన్నర్ అజాజ్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలున్నాయి. ఇటీవల వన్డేల ద్వారా అరంగేట్రం చేసిన పొడగరి పేస్ బౌలర్ కైల్ జేమీసన్ టెస్టుల్లోనూ తన సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా పూర్తి ఫిట్ నెస్ సంతరించుకోవడంతో కివీస్ జట్టు బలంగా కనిపిస్తోంది.