Ravichandran Ashwin: మ్యాచ్ ఆడితే ప్రత్యర్థులు వేళ్లు కట్ చేస్తామన్నారు: టీమిండియా స్పిన్నర్ అశ్విన్

  • మ్యాచ్ సమయంలో నన్ను కిడ్నాప్ చేశారు 
  • సమయం పూర్తయ్యే వరకు అక్కడే ఉంచేశారు 
  • ఆ తర్వాత వారే నన్ను ఇంటి వద్ద దిగబెట్టారు
cricketer aswin told raivals warned me fingers will cut if played

గతంలో ఓసారి ముఖ్యమైన మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థులు తనను కిడ్నాప్ చేశారని, ఆడితే వేళ్లు కట్ చేస్తామని బెదిరించారని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. 'మ్యాచ్ కి ముందు నలుగురు వ్యక్తులు వచ్చి నన్ను తీసుకువెళ్లారు. ఓ చాయ్ షాపు ముందు నన్ను కూర్చోబెట్టి బజ్జీలు, వడలు కొని పెట్టారు. సమయం అయిపోతోందని చెపితే అప్పుడు చెప్పారు అసలు విషయం' అంటూ తన బాల్యం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు అశ్విన్.

నిన్నటి వరకు టీమిండియాలో టాప్ స్పిన్నర్ గా వెలుగొందిన అశ్విన్.. తాజా స్పిన్నర్లు కుల్దీప్, చాహాల్ వంటి వారు ప్రతిభ చూపడంతో ప్రస్తుతం తాను టెస్ట్ మ్యాచ్ కే పరిమితమైన విషయం తెలిసిందే. క్రికెట్ లో తన టీనేజ్ అనుభవాలను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

'బాల్యంలో రోడ్డు పైనే ఎక్కువగా క్రికెట్ ఆడేవాడిని. కానీ నాన్నకు ఇది ఇష్టం ఉండేది కాదు. ఆయనను తప్పించుకు తిరుగుతూ నా ఆట కొనసాగించే వాడిని. మా జట్టులో నేను ప్రధాన బౌలర్ గా ఉండేవాడిని. దీంతో సహజంగానే ప్రత్యర్థుల దృష్టి నాపై ఉండేది' అని చెప్పుకొచ్చాడు.

'ఓ రోజు మేము ప్రత్యర్థులతో ఫైనల్ మ్యాచ్ తలపడాల్సి ఉంది. ఎప్పటిలాగే నేను సిద్ధమవుతుండగా నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై మా ఇంటికి వచ్చారు. నన్ను రమ్మని పిలిచారు. అనుమానం వచ్చి...ఎక్కడికీ? అని అడిగితే మ్యాచ్ ఆడుతున్నావు కదా, అందుకే తీసుకువెళ్లడానికి వచ్చామని చెప్పారు.

నేనేమో మా జట్టు సభ్యులు పంపారేమోననుకుని వారితోపాటు వెళ్లాను. టీ షాప్ లో కూర్చోబెట్టి సమయం అయ్యేవరకు బజ్జీలు, వడలు కొనిపెట్టి తినమన్నారు. మ్యాచ్ కి టైం అయిపోతోందంటే అసలు విషయం మెల్లగా చెప్పారు. అప్పుడుగాని వారు ప్రత్యర్థులని నాకు తెలియదు. సమయం అయిపోయిన తర్వాత వారే నన్ను ఇంటివద్ద దించి వెళ్లిపోయారు' అంటూ చిన్ననాటి సరదా సంఘటనలను గుర్తు చేసుకున్నాడు అశ్విన్.

More Telugu News