Suresh: 50 వేల పాములను పట్టిన సురేశ్... ఇప్పుడు బతుకుతాడో, లేదో తెలియని స్థితిలో..!

  • గతంలో ఎన్నోమార్లు పాము కాటును రుచిచూసిన సురేశ్
  • తాజాగా కాటు వేసిన రక్తపింజరి
  • పనిచేయని యాంటీ వెనమ్ ఇంజక్షన్
Snake Catcher Suresh in Hospital

వావా సురేశ్... కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో ఇతని పేరు చాలా సుపరిచితం. ఎక్కడ, ఎటువంటి విషపూరిత పాము కనిపించినా, క్షణాల్లో వాలిపోయి, దాన్ని ఒడుపుగా పట్టుకుని అడవిలో వదిలి పెట్టడం ఇతని వ్యాపకం. చిన్న వయసు నుంచే పాములను పట్టడంలో నేర్పరిగా మారిన సురేశ్, ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

జనావాసాల్లోకి పాము వచ్చిందని తెలియగానే వెళ్లి, దాన్ని అదుపు చేసే సురేశ్ ను గతంలో ఎన్నో మార్లు పాములు కాటేశాయి. కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో వందలాది సర్పాలను సురేశ్ పట్టుకున్నాడు. తాజాగా, అత్యంత విషపూరితమైన రక్త పింజరి, సురేశ్ ను కాటేసింది. డాక్టర్లు అతనికి యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చినా, అది పని చేయలేదు. ఇప్పటికే పలు మార్లు యాంటీ వీనమ్ ఇంజక్షన్లను అతను చేయించుకుని ఉండటమే ఇందుకు కారణం.

అతని శరీరంలోకి ఎక్కిన యాంటీ వీనమ్ ఔషధం, రక్తపిజరి కాటుతో వెళ్లిన విషాన్ని అదుపు చేయడంలో విఫలమైంది. దీంతో మరో మూడు రోజులు గడిస్తేగాని సురేశ్ పరిస్థితిపై ఓ అవగాహనకు రాలేమని వైద్యులు స్పష్టం చేశారు.

More Telugu News