నిద్రిస్తూ మంచంపై నుంచి పడి ప్రాణాలు విడిచిన యువకుడు

16-02-2020 Sun 07:50
  • స్నేహితుడి బర్త్ డే పార్టీలో మద్యం తాగిన యువకుడు
  • బాధితుడిది మిజోరం రాష్ట్రం
  •  అర్ధ రాత్రి వేళ కిందపడిన స్నేహితుడిని చూసిన మరో స్నేహితుడు
Boy dead while sleeping in shamirpet

స్నేహితుడి బర్త్ డే వేడుకల్లో మద్యం తాగిన యువకుడు ఆ తర్వాత నిద్రిస్తూ మంచంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్ నుంచమ (23)  మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం, బొమ్మరాశిపేటలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం తనకు కేటాయించిన గదిలోని బంక్‌బెడ్‌పై లాల్ నిద్రపోయాడు. అయితే, అర్ధరాత్రి వేళ నిద్రలేచిన మరో స్నేహితుడు లాల్‌మాల్ సౌమ కిందపడి ఉన్న మిత్రుడిని చూసి లేపాడు. అతడిలో కదలిక లేకపోవడంతో వెంటనే రిసార్ట్స్ సిబ్బందికి చెప్పారు. వారు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. రిసార్ట్స్‌కు చేరుకున్న 108 సిబ్బంది లాల్‌ను పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.