కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేటీఆర్ అజెండాగా ఉంది: కిషన్ రెడ్డి ధ్వజం

15-02-2020 Sat 16:36
  • తెలంగాణలో పేదలకు ఇళ్లు, వైద్య సౌకర్యాలు అందడం లేదు
  • ఎవరి పొరపాటు వల్ల ఇలా జరుగుతోంది?
  • ఇందుకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్
Kishanreddy uproars on Ktr

తెలంగాణ లో పేదల కోసం ఎన్ని లక్షల టూ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకు ముందుకొస్తుందో అన్ని లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జేబీఎస్-ఎంజీబీస్ వరకు మెట్రో రైల్ లో ప్రయాణించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇచ్చే రూపాయికే కిలో బియ్యానికి సంబంధించి ఇరవై ఎనిమిది రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ పేరిట వైద్య సాయం కేంద్రం అందిస్తోందని గుర్తుచేశారు. ఎవరి పొరపాటు కారణంగా తెలంగాణలో పేదలకు ఇళ్లు, వైద్య సౌకర్యాలు అందడం లేదో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే అజెండాగా కేటీఆర్ పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.