Narendra Modi: మరి మీ ‘బళ్లారి గ్యాంగ్’ సంగతేంటి?: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఫైర్

  • కేసులున్నోళ్లకు టికెట్లు ఎందుకిచ్చారో చెప్పాలని సుప్రీంకోర్టు చెప్పింది
  • ఆ వెంటనే మీరు కర్ణాటకలో కేసులున్న ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు
  • సుప్రీంకోర్టు ఆదేశాలను అవహేళన చేశారని విమర్శ

అటవీ, మైనింగ్ కు సంబంధించి అవినీతి ఆరోపణలున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కు అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. క్రిమినల్ కేసులున్న వారికి టికెట్లు ఎందుకిచ్చారో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అదే సమయంలో బీజేపీ సర్కారు ఇలా చేయడం కోర్టును అవహేళన చేయడమేనని ఆరోపించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రధాని నరేంద్ర మోదీ చింపేశారని విమర్శించింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ రణదీప్ సింగ్ సుర్జేవాలా వరుసగా ట్వీట్లు చేశారు.

బళ్లారి గ్యాంగ్ ను రక్షించేందుకే..

క్రిమినల్ కేసులు ఉన్నవారికి ఎందుకు టికెట్లు ఇచ్చారనే దానిపై రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను మోదీ అవహేళన చేశారని సుర్జేవాలా ఆరోపించారు. ’‘బళ్లారి గ్యాంగ్ ను కాపాడేందుకు ప్రధాని మోదీ, బీజేపీ మళ్లీ రంగంలోకి దిగారు. క్రిమినల్ కేసులు ఉన్న వారికి టికెట్లు ఎందుకు ఇచ్చిందని సుప్రీంకోర్టు అడిగింది. అయితే అక్రమంగా దోచుకున్న వాళ్లు కేవలం ఎమ్మెల్యేలుగా మాత్రమే కాదు.. మంత్రులు కూడా అవుతారని మోదీ చేసి చూపించారు. మరి సుప్రీంకోర్టు దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రికి కోర్టు ధిక్కార నోటీసు పంపుతుందా?’’ అని పేర్కొన్నారు.

More Telugu News