Kurnool District: చనిపోతున్నా.. రైలు పట్టాలపై పడుకున్నా: భార్యకు ఫోన్ చేసి చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు

  • కలసిరాని వ్యవసాయం
  • పెట్టుబడుల కోసం రూ. 7 లక్షల అప్పులు
  • అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య
A Farmer suiced in Kurnoor dist

వ్యవసాయంలో నష్టాలు ఆ రైతును కుంగదీశాయి. పెట్టుబడుల కోసం పెట్టిన ఏడు లక్షల రూపాయలు నేలపాలు కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పు తీర్చే మార్గం లేక ఉసురు తీసుకోవాలని నిర్ణయించాడు. వాకింగ్ కోసం వెళ్తున్నట్టు భార్యకు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన రైతు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

జిల్లాలోని కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన శ్రీదేవి-రాజ్‌కుమార్ (35) భార్యాభర్తలు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవించేవారు. ఐదేళ్లుగా నష్టాలు రావడంతో రాజ్‌కుమార్ కుంగిపోయాడు. కుటుంబ పోషణ కోసం రాజ్‌కుమార్ మగ్గం నేస్తూనే, మరోవైపు వ్యవసాయం చేసేవాడు. పెట్టుబడుల కోసం రూ. 7 లక్షలు అప్పులు చేశాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో చేసిన అప్పును తీర్చే మార్గం కనిపించక రాజ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు.

దీంతో నిన్న ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నట్టు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రైలు పట్టాలపై పడుకున్నాడు. అక్కడి నుంచి భార్యకు ఫోన్ చేసి, అప్పులు తీరే దారి కనిపించడం లేదని, రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని, పట్టాలపై పడుకున్నానని చెప్పాడు.

కంగారు పడిన శ్రీదేవి వెంటనే తన బంధువులకు, పోలీసులకు సమాచారం అందించింది. అప్రమత్తమైన వారు వెంటనే వెతికేందుకు బయలుదేరారు. అయితే, అప్పటికే రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News