chicken: కరోనా దెబ్బకు బెంబేలెత్తుతున్న పౌల్ట్రీ పరిశ్రమ.. దారుణంగా పడిపోయిన చికెన్ విక్రయాలు

  • చికెన్ వల్ల కరోనా సోకుతుందని అసత్య ప్రచారం
  • ఇప్పటికే ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన కేంద్రం
  • అయినా ప్రజల్లో బెరుకు.. చికెన్‌కు దూరం
Corona virus affected Chicken sellers

కరోనా వైరస్ కాటుకు పౌల్ట్రీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. కరోనా వైరస్ ప్రబలడానికి మాంసాహారమే కారణమని భావిస్తున్న ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో చికెన్ విక్రయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 50 శాతానికి విక్రయాలు దిగజారినట్టు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇది 70 శాతంగా ఉన్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మామూలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సగటున ఐదు లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. ఆదివారం, సెలవు దినాల్లో ఇది రెండింతలు కాగా, పండుగ రోజుల్లో మూడింతల విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, ఈ విక్రయాలు ఇప్పుడు సగానికిపైగా పడిపోవడం పౌల్ట్రీ వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది.

 చికెన్ ద్వారా కరోనా వైరస్ సోకుతుందన్న అసత్య ప్రచారమే ఇందుకు కారణమని వ్యాపారులు వాపోతున్నారు. గతవారం రిటైల్  మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.180కి అమ్ముడుపోగా నిన్న రూ.140కి పడిపోయింది. కాగా, చికెన్ వల్ల కరోనా వైరస్ సోకే అవకాశం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

More Telugu News