చివరి వన్డేలో కూడా కివీస్ దే గెలుపు.... ఉసూరుమన్న టీమిండియా!

11-02-2020 Tue 15:34
  • గ్రాండ్ హోమ్ మెరుపుదాడి
  • 47.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్
  • సిరీస్ 3-0తో క్లీన్ స్వీప్
All round Kiwis thrashes Team India to clinch ODI Series

మౌంట్ మాంగనుయ్ లో టీమిండియాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఓ వన్డే సిరీస్ లో భారత్ ఇంత ఘోరంగా ఓడిపోవడం 31 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.

ఈ మ్యాచ్ లో భారత్ విసిరిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్ రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్ కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. మరోవైపు వికెట్ కీపర్ టామ్ లాథమ్ 32 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్ విజయంలో పాలుపంచుకున్నాడు.

అంతకుముందు ఆరంభంలో ఓపెనర్లు గప్టిల్ 66, నికోల్స్ 80 పరుగులు చేసి పటిష్ట పునాది వేశారు. దాంతో మిగతా బ్యాట్స్ మెన్ పని సులువైంది. టీమిండియా బౌలర్లు మధ్యలో కొన్ని వికెట్లు తీసినా, గ్రాండ్ హోమ్, లాథమ్ వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేశారు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (112) ఆటే హైలైట్. రాహుల్ సెంచరీతో అలరించాడు. పృథ్వీ షా 40, మనీష్ పాండే 42 పరుగులు సాధించారు. మయాంక్ (1), కోహ్లీ (9) విఫలమయ్యారు.