ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టింది: విజయసాయిరెడ్డి

11-02-2020 Tue 11:52
  • ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్‌ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించలేదు
  • వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో మీడియాలో వార్తలు
  • కొత్త టారిఫ్‌తో కోటీ 43 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి
  • రూ.60 కోట్ల వరకు భారం తగ్గుతుంది
vijaya sai reddy fires on yellow media

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మండలి (ఈఆర్‌సీ) నూతన టారిఫ్‌ వివరాలను ప్రకటించిన నేపథ్యంలో దీనిపై వస్తోన్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కరెంటు ఛార్జీలను పెంచుతూ ఈఆర్‌సీ ఉత్తర్వులు జారీ చేసిందని, నెలకు 500 యూనిట్లకు మించి విద్యుత్తు వినియోగించే ఇళ్లకు యూనిట్‌కు 90 పైసల చొప్పున పెంచారని వస్తోన్న వార్తలపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు.
 
'ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్‌ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టింది. కొత్త టారిఫ్‌తో కోటీ 43 లక్షల మంది వినియోగదారులకు రూ.60 కోట్ల వరకు భారం తగ్గుతుందన్న వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెర తీసింది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.