ఫలితాలకు ముందే ఓటమిని ఒప్పేసుకున్న బీజేపీ.. పార్టీ కార్యాలయంలో ఆకర్షిస్తున్న పోస్టర్!

11-02-2020 Tue 10:04
  • పరాజయంతో మనం నిరాశకు గురికాకూడదంటూ పోస్టర్
  • ఓటమిని ముందే ఊహించి ఏర్పాటు చేసి ఉంటుందని భావన
  • కార్యకర్తల్లో నిరాశను చెదరగొట్టేందుకే
BJP expected defeat in Delhi assembly elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించిందా? ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమైన ఓ పోస్టర్‌ను చూస్తే నిజమేనని అనిపించకమానదు. ‘విజయంతో మనం అహంకారులుగా మారకూడదు. పరాజయంతో మనం నిరాశకు గురికాకూడదు’ అని రాసి ఉన్న ఆ పోస్టర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫొటో ఉంది.

ఆ పోస్టర్‌లో ఉన్నదానిని బట్టి బీజేపీ తన ఓటమిని ముందే ఊహించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు విజయం తమదేనని బీరాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు ఫలితాల ట్రెండ్ చూసి నీరుగారిపోతున్నారు. కార్యకర్తల్లో నిరాశ దరిచేరకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ పోస్టర్ అతికించినట్టు చెబుతున్నారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ గెలుపు దాదాపు ఖాయమైపోయింది. ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు ఇప్పటికే మెజారిటీ సంఖ్యను దాటిపోయింది.