Uttar Pradesh: 'వేరే కులం అబ్బాయిని నీవెలా పెళ్లి చేసుకుంటావు?' అంటూ పెళ్లి కూతురికి అమానవీయ శిక్ష

  • యూపీలోని ఝాన్సీలో ఘటన
  • పెళ్లికూతురు గోమూత్రం తాగి, ఆవు పేడ తినాలని శిక్ష
  • శిక్ష అమలుకు తేదీ కూడా ఖరారు
  • గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసిన పోలీసులు

కంప్యూటర్ యుగంలోనూ కుల వివక్ష, కుల దురహంకారం విపరీతంగానే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువకుడు, యువతి ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో కులాలు వేర్వేరు అయితే  ఎలా పెళ్లి చేసుకుంటారు? అని గ్రామ పెద్దలు ప్రశ్నిస్తూ  ఊరి నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పెళ్లి కుమారుడి తండ్రి... తమ గ్రామ పెద్దలను బతిమిలాడుకున్నాడు. ఒప్పించి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ పెట్టించాడు. ఆ అమ్మాయి వేరే కులానికి చెందినది కాబట్టి ఆమెను శుద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్న గ్రామ పెద్దలు... ఆమె గోమూత్రం తాగి, ఆవు పేడ తినాలని తీర్పునిచ్చారు. వేరే కులం అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రశ్నిస్తూ ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా కట్టాలన్నారు.

అమ్మాయిని తమ కులంలో కలుపుకోవాలంటే ఈ శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. రెండు నెలల్లో శిక్ష అమలు చేస్తామని తేదీని ఖరారు చేశారు. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. పంచాయితీ పెద్దలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News