Women Cricket: ప్చ్..అమ్మాయిలు మళ్లీ నిరాశ పర్చారు.. ముక్కోణపు టీ20 టోర్నీలో హర్మన్ సేనకు రెండో ఓటమి

  • భారత్ పై ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపు
  • టాస్ గెలిచి బౌలింగ్ చేపట్టిన ఇంగ్లండ్
  • భారత్ 123/6.. ఇంగ్లండ్ 124/6

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 ముక్కోణపు క్రికెట్ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో కూడా భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మూడు దేశాలు పాల్గొంటున్న ఈ  టోర్నీలో భారత్ తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు పాల్గొంటున్నాయి. ఈ రోజు మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పొందింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది.

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. వెంటనే షఫాలి వర్మ వికెట్ (8 పరుగులు... 9 బంతులు, ఒక ఫోర్) ను కోల్పోయింది. వన్ డౌన్ బ్యాట్స్ వుమన్ గా వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, మరో ఓపెనెర్ స్మృతి మంధానకు తోడ్పాటు అందించడంతో భారత్ పరవా లేదనిపించే స్కోరు చేసింది. మంధాన అద్భుతంగా ఆడి 40 బంతుల్లో 45 పరుగులు చేసింది. మంధాన స్కోరులో 7 ఫోర్లు, ఒక్క సిక్సర్ ఉన్నాయి.

తర్వాత జెమీమా 23 (20బంతులు, మూడు ఫోర్లు) చేసి పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ వుమెన్ లో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 14 (23 బంతులు, ఒక ఫోర్) పరుగులు చేసి ఔటయింది. మొత్తానికి భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లీష్ అమ్మాయిల జట్టు ఆరు వికెట్లు కోల్పోయి ఇంకా ఓవర్, ఒక బంతి మిగిలి ఉండగానే 124 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నటాలియా షివెర్ అర్ధ సెంచరీతో అకట్టుకోగా, కెప్టెన్ హీధర్ నైట్ 18 పరుగులు, ఫ్రాన్ విల్సన్ 20 పరుగులు, లారెన్ విన్ ఫీల్డ్ 2 పరుగులు నాటౌట్లుగాా ఉండి ఇంగ్లండ్ ను విజయ తీరాలకు చేర్చారు.

భారత బౌలర్లలో రాజేశ్వరీ గ్వైక్వాడ్ 23 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ఇంగ్లీష్ బౌలర్ అన్య శ్రుబ్ సోల్ అందుకుంది. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కు సన్నాహక టోర్నీగా భావిస్తోన్న ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరాలంటే.. శనివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.

More Telugu News