సీన్ రివర్స్... రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని ఎలా అంటారన్న వైసీపీ ఎమ్మెల్యే!

06-02-2020 Thu 11:32
  • సమస్యలు చెప్పుకునేందుకు అమరావతి రైతులు సీఎంని కలిశారు
  • భద్రతా కారణాల వల్ల పరిమిత సంఖ్యలో రైతులు వచ్చారు
  • చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు

రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న అమరావతి ప్రాంత రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ మంత్రులు, నేతలు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. పెయిడ్ ఆర్టిస్టులన్న వైసీపీ నేతలపై టీడీపీ సహా విపక్ష నేతలు మండిపడ్డారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సీఎం జగన్ ను కొందరు రైతులు కలిసిన సంగతి తెలిసిందే. అయితే వీరు అమరావతి రైతులు కాదని... వైసీపీ నేతలు తీసుకొచ్చిన పెయిడ్ ఆర్టిస్టులంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ, రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదని అన్నారు.

తమ సమస్యలను చెప్పుకునేందుకు అమరావతి రైతులు ముఖ్యమంత్రిని కలిశారని ఆర్కే చెప్పారు. భద్రతా కారణాల వల్ల పరిమిత సంఖ్యలో రైతులు వచ్చారని తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక గ్రామ స్థాయి నేతలా ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పారు. మంగళగిరిలో చంద్రబాబు పోటీ చేసి ఉంటే ఓటమిపాలయ్యేవారని అన్నారు.