KIA Motors: ఏపీ నుంచి కియా మోటార్స్ ప్లాంట్ తరలింపు?.. 'రాయిటర్స్' సంచలన కథనం!

  • తమిళనాడుతో ముగిసిన ప్రాథమిక చర్చలు
  • మరో వారంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం
  • వైపీపీ ప్రభుత్వంతో ఇబ్బందులే తరలింపుకు కారణం
  • రాయిటర్స్ సంచలన కథనం

ఏపీకి మణిహారంలా నిలిచిన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ 'రాయిటర్స్ మీడియా' సంచలన కథనాన్ని ఇచ్చింది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన తమ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంటును తమిళనాడుకు తరలించే యోచనలో ఈ సంస్థ ఉందనీ, ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని ఈ మేరకు రాయిటర్స్ పేర్కొంది. కియా మోటార్స్ పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించిన నెలల వ్యవధిలోనే ఈ మేరకు అడుగులు వేస్తున్నట్టు వ్యాఖ్యానించింది.

ఈ అంశానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి, మరో పేరు వెల్లడించని వ్యక్తి మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వంతో కియా మోటార్స్ యాజమాన్యం చర్చలు జరుపుతోందని రాయిటర్స్ తెలిపింది . సదరు ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, ప్రస్తుత ఏపీ ప్రభుత్వంతో కియా మోటార్స్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని... ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ప్లాంటును తరలించాలనుకుంటోందని చెప్పినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు ప్రాథమిక దశ చర్చలు ముగిశాయని... వచ్చే వారం సెక్రటరీ లెవెల్ మీటింగ్ జరుగుతుందని తెలిపింది. ఆ మీటింగ్ తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని సదరు ప్రభుత్వ అధికారి చెప్పినట్టు పేర్కొంది.

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం కూడా కియా మోటార్స్ కు ఇబ్బందికరంగా మారినట్టు రాయిటర్స్ అభిప్రాయపడింది. గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్ లను కూడా వైసీపీ ప్రభుత్వం సమీక్షించాలని భావిస్తున్న నేపథ్యంలోనే కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోవడమే మంచిదని భావిస్తున్నట్టు తెలిపింది.

ప్లాంటును తరలించే ప్లాన్ లేదు: కియా మోటార్స్

మరోవైపు కియా మోటార్స్ దీనిపై స్పందిస్తూ, దీర్ఘకాల ప్రణాళికతో తాము భారత మార్కెట్లోకి అడుగు పెట్టామని తెలిపింది. తమ కార్యకలాపాలను విస్తరించాలనే ఆలోచన కంటే ముందు... ఏపీలోని ప్లాంటును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనేదే తమ ప్రధాన లక్ష్యమని, ప్రస్తుతం ఉన్న చోటు నుంచి ప్లాంటును తరలించే ప్లాన్ ఏమీ లేదని పేర్కొంది. ఏపీలోని కియా మోటార్స్ ఏడాదికి 3 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి కలుగుతోంది.

More Telugu News