Chandrababu: ఏ చట్టం ప్రకారం రాజధానిని తరలించాలని చూస్తున్నారు?: చంద్రబాబునాయుడు

  • ఈ దుర్మార్గపు సీఎంకి పరిపాలించడం తెలియదు
  • కక్షలు, కార్పణ్యాలతో రైతుల పొట్ట కొట్టే పరిస్థితి
  • నీ తిక్క కుదిరే వరకూ వదిలిపెట్టమంటూ వ్యాఖ్యలు

రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, 23-04-2015 లో అమరావతి ఏపీ రాజధానిగా జీవో విడుదల చేశామని గుర్తుచేశారు. ఏ చట్టం ప్రకారం రాజధానిని తరలించాలని చూస్తున్నారని ప్రశ్నించారు.

ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రికి పరిపాలించడం తెలియదు అని, కక్షలు, కార్పణ్యాలతో రైతుల పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారని నిప్పులు చెరిగారు. ‘ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండు, నీ తిక్క కుదిరే వరకూ వదిలిపెట్టం’ అని జగన్ ని హెచ్చరించారు.

ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయని, ఒకే ఒక్క చెత్త పార్టీ వైసీపీకి ఆశయాలు, ఆలోచనలు లేవని, ఈ పార్టీ గాలి కొచ్చిందని, గాలికే పోతుందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ పార్టీ ప్రజలకు నష్టం చేస్తోందని, అదే తన బాధ అని అన్నారు. రాజధాని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని, సమస్యకు పరిష్కారం కన్నీళ్లు కాదని, అధైర్యపడొద్దని వీరనారీమణులులా పోరాడాలని పిలుపు నిచ్చారు.

More Telugu News