Vellampalli Srinivasa Rao: పెనుగొండలో ‘వాసవి నివాస్’ కు శంకుస్థాపన.. సీఎం జగన్ నిధులు మంజూరు చేశారు: మంత్రి వెల్లంపల్లి

  • యాత్రికుల వసతి సముదాయం ‘వాసవి నివాస్’
  • కోటి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు
  • ఆర్యవైశ్యుల అభ్యున్నతి వైసీపీ తోనే సాధ్యమన్న వెల్లంపల్లి

ఆర్యవైశ్యుల అభ్యున్నతి వైసీపీ తోనే సాధ్యమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవి క్షేత్రంలో యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, యాత్రికుల వసతి సముదాయం వాసవి నివాస్ నిర్మాణానికి సీఎం జగన్ కోటి యాభై లక్షల రూపాయల నిధులను కేటాయించారని అన్నారు. మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్య వసతి సముదాయ నిర్మాణానికి సీఎం ఆదేశాలతో దేవాదాయ మంత్రిత్వ శాఖ ద్వారా జీఎఫ్ నిధుల నుంచి 16 గదుల నిర్మాణానికి ఈ నిధులను విడుదల చేసినట్టు చెప్పారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండలోని ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి వేలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారని వెల్లంపల్లి అన్నారు. యాత్రికుల సౌకర్యార్థం వసతి గృహ సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం ఈ నిధులను కేటాయించినట్టు చెప్పారు. అనంతరం వాసవి క్షేత్రంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

More Telugu News