Arvind Kejriwal: మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి.. బీజేపీకి డెడ్ లైన్ విధించిన కేజ్రీవాల్!

  • రేపు మధ్యాహ్నంలోగా అభ్యర్థి పేరును వెల్లడించాలి
  • ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు 
  • అది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమే అవుతుంది

మరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో బీజేపీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శల తీవ్రతను పెంచారు. వారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో బీజేపీ వెల్లడించాలని... రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయాన్ని ఇస్తున్నానని సవాల్ విసిరారు. డెడ్ లైన్ లోగా బీజేపీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే మరో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు.

ఢిల్లీ ప్రజల తీర్పు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని అమిత్ షా చెబుతున్నారని... ఇది ఢిల్లీ ప్రజల నుంచి బ్లాంక్ చెక్ ను డిమాండ్ చేస్తున్నట్టు ఉందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. తాము బీజేపీకి ఓటు వేస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయాన్ని ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక చేతకాని వ్యక్తినో, చదువురాని వ్యక్తినో సీఎం చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమే అవుతుందని అన్నారు.

సాధారణంగా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని బీజేపీ ముందుగానే ప్రకటించడం జరగదు. ప్రధాని మోదీ పేరు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలతో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లడం పరిపాటి. అత్యంత కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సీఎం అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాతే యోగి ఆదిత్యనాథ్ ను సీఎంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ సవాల్ పట్ల బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Telugu News