Ananthkumar Hegde: మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ పై అధిష్ఠానం ఆగ్రహం

  • బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశం
  • వారి పోరాటం నిజమైనది కాదు
  • చరిత్రను చదివితే నా రక్తం మరుగుతోందన్న నేత  

మహాత్మాగాంధీ చేసిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఓ డ్రామా అంటూ తీవ్ర విమర్శలు చేసిన కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి అనంత్ కుమార్ హెగ్డేపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. హెగ్డే వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నేత జగదాంబికా పాల్  స్పందిస్తూ, అవి ఆయన వ్యక్తిగతంగా చేసినవన్నారు. కేంద్రమంత్రి ఆశ్వనీ చౌబే స్పందిస్తూ.. హెగ్డే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని పేర్కొన్నారు.

శనివారం కర్ణాటకలో జరిగిన ఓ బహిరంగ సభలో హెగ్డే ప్రసంగిస్తూ, ‘అప్పుడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిలో ఎవరూ కూడా పోలీసుల చేతుల్లో దెబ్బలు తినలేదు. వారి స్వాతంత్ర్య పోరాటం ఓ పెద్ద నాటకం. బ్రిటీషర్ల అనుమతితోనే ఆ నేతలు ఈ నాటకం ఆడారు. వారు చేసిన పోరాటం నిజమైనది కాదు. స్వాంతంత్ర్య పోరాటంలో అదొక సర్దుబాటు. సత్యాగ్రహ దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష కారణంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. కాంగ్రెస్ ను ప్రజలు అభిమానిస్తూ.. మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇది నిజంకాదు. సత్యాగ్రహం కారణంగా బ్రిటిషర్లు దేశాన్ని వీడలేదు. వారు ఎలాంటి ఆందోళనకు గురికాకుండానే స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లారు. చరిత్రను చదివితే నా రక్తం మరుగుతోంది. అటువంటి నేతలు మహాత్ములయ్యారు’ అని హెగ్డే అన్నారు.

More Telugu News