China: కేవలం 9 రోజుల్లో చైనా అద్భుతం... ఎలా చేసిందంటే..!

షార్ట్స్‌లో చూడండి
చైనా ఉక్కుసంకల్పం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పారిశ్రామిక విప్లవాన్ని ఇంటింటా తీసుకువచ్చి ప్రతి ఇంటిని ఓ కుటీర పరిశ్రమగా మార్చి ప్రపంచ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించడం చైనాకే చెల్లింది. ఇప్పుడు కరోనా వైరస్ ను కూడా చైనా ఓ సవాల్ గా తీసుకుంది. ఓవైపు కరోనాకు మందు కనిపెట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు నిర్వహిస్తూనే, మరోవైపు బాధితుల కోసం అన్ని సదుపాయాలతో ప్రత్యేకంగా ఓ భారీ ఆసుపత్రి నిర్మించింది. ఈ 1000 పడకల ఆసుపత్రి కేవలం 9 రోజుల్లో నిర్మితమవడమే అసలు అద్భుతం!

కరోనా వైరస్ బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తే వ్యాధి ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుందని భావించి చైనీయులు ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణం ఆలోచన చేశారు. అది కూడా కరోనా వైరస్ కు జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్ నగర శివార్లలో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో ప్రధానంగా ముందే రూపుదిద్దుకున్న కాంక్రీట్ బ్లాక్స్ ను ఉపయోగించారు. దానివల్ల ఎంతో సమయం ఆదా అయింది. పునాదులు వేసిన తర్వాత వాటిపై కాంక్రీట్ బ్లాక్స్ ను ఓ క్రమపద్ధతిలో అమర్చుకుంటూ వెళ్లారు. ఎక్కడికక్కడ జాయింట్లను పకడ్బందీగా కలుపుకుంటూ పోయారు.

ఇందుకోసం దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న కాంక్రీట్ బ్లాక్స్ ను వుహాన్ కు తరలించారు. నిపుణులైన ఇంజినీర్లు దేశంలో ఎక్కడున్నా సరే వాళ్లందరినీ వుహాన్ తీసుకువచ్చి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రతువులో 7 వేల మంది కార్మికులతో పాటు 1000 యంత్రాలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ ఆసుపత్రికి అవసరమైన నిర్మాణ సరంజామా తరలింపు, మానవ వనరుల తరలింపు బాధ్యతను సైన్యానికి అప్పగించడంతో ఆసుపత్రి నిర్మాణం పరుగులుపెట్టింది. ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, 419 వార్డులు, 30 ఐసీయూలు ఉన్నాయి. 1400 మంది డాక్టర్లను ఇక్కడ నియమించనున్నారు. నేటి నుంచి ఇక్కడ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
Go Back to Shorts
China
Corona Virus
Wuhan
Hospital

More Telugu News