Mahabubabad District: 60 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. తహసీల్దార్‌ను భుజాలపై మోసి ఊరేగించిన గ్రామస్థులు!

  • ఆరు దశాబ్దాలుగా పట్టాల కోసం తిరుగుతున్న రైతులు
  • వారి సమస్యకు పరిష్కారం చూపిన తహసీల్దార్ రంజిత్‌కుమార్
  • గజమాలతో సత్కరించి, భుజాలపై మోస్తూ ఊరేగింపు

60 ఏళ్లుగా వేధిస్తున్న సమస్యను పరిష్కరించిన తహసీల్దార్‌ను గ్రామస్థులు తమ భుజాలపై మోసి ఊరేగించారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని మాధవాపురం, మల్యాల గ్రామాలకు చెందిన పలువురు రైతులకు 60 ఏళ్లుగా పట్టాలు అందలేదు. సర్వే నంబర్లకు, అక్కడున్న భూమికి పొంతన లేకపోవడంతో పట్టాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తూ వస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన రైతుబీమా, రైతుబంధు పథకాలకు వీరు దూరమవుతున్నారు.

ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తహసీల్దార్‌గా వచ్చిన రంజిత్ కుమార్ రైతుల సమస్యపై దృష్టిసారించారు. వివాదంలో ఉన్న రైతుల భూములను సర్వే చేశారు. తప్పొప్పులను సరిచేసి ప్రభుత్వానికి పంపారు. ఆయన కృషి ఫలితంగా, మాధవాపురంలో 900 మందికి, మల్యాలలో 1548 మందికి, ఆమనగల్‌లో 1400 మంది రైతులకు పట్టాలు దక్కాయి.

మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేతుల మీదుగా అర్హులైన రైతులకు పట్టాలు ఇప్పించారు. దీంతో ఆనందం పట్టలేని రైతులు తహసీల్దార్ రంజిత్‌కుమార్‌ను గజమాలతో సత్కరించారు. భుజాలపై మోస్తూ ఊరేగించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

More Telugu News