Road Accident: శ్రీకాకుళం జిల్లాలో కాలువలోకి దూసుకు వెళ్లిన కారు... ఇద్దరి మృతి!

  • శ్రీకాకుళం జిల్లా వంశధార రిజర్వాయర్ వద్ద ప్రమాదం 
  • క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి వస్తుండగా ఘటన 
  • మృతుల్లో ఒకరిది ఖమ్మం ....మరొకరిది రాజమండ్రి

శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద వున్న వంశధార రిజర్వాయర్ ను ఆనుకుని ప్రవహిస్తున్న కాలువలో నిన్న అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ కోరమాండల్ ఫెర్టిలైజర్స్ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ఒకరిది ఖమ్మం కాగా, మరొకరిది రాజమండ్రి అని గుర్తించారు.

పోలీసుల కథనం మేరకు... విశాఖలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రాజమండ్రివాసి పవన్ (32), ఖమ్మంవాసి బిందేటి చంద్రమోహన్ (45)తోపాటు మరో ముగ్గురు ఉద్యోగులు వెంకటగిరి ప్రసాద్, ఎం.మహేశ్వరరావు, ఎస్.దుర్గా నాగప్రవీణలు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలోని సెంచూరియన్ యూనివర్సిటీలో జరిగే సమావేశానికి హాజరయ్యారు.

నిన్న రాత్రి తిరిగి విశాఖ ప్రయాణమయ్యారు. కారు అర్ధరాత్రి దాటాక హిరమండలం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పవన్, చంద్రమోహన్ లు కారులోనే చనిపోయారు.

మిగిలిన ముగ్గురు గాయపడినా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయానికి కాలువలో తొమ్మిది అడుగుల ఎత్తున నీరుంది. దీంతో పైనుంచి నీటిని నిలుపుచేసి కారును బయటకు తీశారు. హిరమండలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News