KTR: రెండు మున్సిపాలిటీలు గెలిచి ఎగిరెగిరిపడుతోంది: బీజేపీపై కేటీఆర్ విమర్శ

  • కాంగ్రెస్‌, బీజేపీలకు 1200 వార్డుల్లో అభ్యర్థులే లేరంటూ ఎద్దేవా 
  • డబ్బుతో గెలిచారని టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం సరికాదు
  • ఓట్లేసిన ప్రజలను ఉత్తమ్‌, లక్ష్మణ్‌ అవమానిస్తున్నారు

తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రెండు మున్సిపాలిటీలు గెలిచి విర్రవీగుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌, బీజేపీలకు 1200 వార్డుల్లో అభ్యర్థులే లేరంటూ ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్ పార్టీ 92 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జయకేతనం ఎగురవేసిందన్నారు.

విపక్షాలు తమ ఓటమికి కారణాలు వెతుక్కోకుండా గెలిచిన టీఆర్ఎస్ పై అనైతిక ఆరోపణలు చేస్తున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుతో గెలిచామనడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. అలా వ్యాఖ్యానిస్తూ, ఓట్లేసిన ప్రజలను ఉత్తమ్‌, లక్ష్మణ్‌ అవమానిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పుడు ఈవీఎంలే కారణమని లొల్లి చేశారు, మరి, ఇప్పుడు జరిగిన మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై ఏం చెబుతారు? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్‌కు అన్ని వ్యవస్థలపై నమ్మకం పోయింది, ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడం లేదు, ఇంట్లో కూర్చోవడం ఉత్తమమని అన్నారు.

More Telugu News