Corona virus: కరోనా బాధితుల కోసం కేజీహెచ్ లో ప్రత్యేక వార్డు: సూపరింటెండెంట్ అర్జున్

  • మూడు పడకలతో ఏర్పాటు 
  • ఇప్పటి వరకు రోగులు ఎవరూ లేరు 
  • ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తంగా ఉన్నాం

ప్రస్తుతం ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధి శరవేగంగా విస్తరిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్ద నగరం విశాఖలో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా అతి పెద్ద పోర్టు ఉండడంతో విదేశాల నుంచి పారిశ్రామిక దిగుమతులు నిత్యం ఉంటాయి. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి రాకపోకలు జరిపే చాలా రైళ్లు విశాఖ నగరం మీదుగానే వెళ్తాయి. కరోనా అతి ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ తీరనగరం విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

ఉత్తరాంధ్ర వైద్యదాయనిగా పేరొందిన కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో కరోనా బాధితుల కోసం మూడు పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ ఇప్పటి వరకు బాధితులెవరూ లేరన్నారు. అయితే అత్యంత ప్రమాకరమైన వైరస్ కాబట్టి ముందు జాగ్రత్తగా పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్ తీవ్రత అధికంగా ఉంటే కిడ్నీలపై దాని ప్రభావం పడుతుందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోకి, మార్కెట్ కి వెళ్లేటప్పుడు ముఖానికి కర్చీఫ్, పేస్ మాస్క్ ధరిస్తే మంచిదన్నారు.  

More Telugu News