Basket Ball Player: కోబ్ ఇక లేడని తెలియగానే నా గుండె పగిలిపోయింది: కోహ్లీ

  • హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రయింట్
  • ప్రమాదంలో కోబ్ కుమార్తె మృతి సహా 9మంది మృతి
  • సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాల వెల్లువ

అమెరికన్ బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రయింట్(41) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చలించిపోయాడు. కాలిఫోర్నియాలోని లాస్ఏంజెల్స్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కోబ్ బ్రయింట్, ఆయన కుమార్తె పదమూడేళ్ల జియానా సహా తొమ్మిది మంది మృతి చెందారు. దాదాపుగా 20 ఏళ్లుగా బాస్కెట్ బాల్ క్రీడలో తనకే సాధ్యమైన ఆటతో రాణించిన కోబ్ దుర్మరణం క్రీడాలోకాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. కోబ్ మృతిపై  ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు తమ సంతాపాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేస్తున్నారు.

కోబ్ మృతిపై ట్విట్టర్ మాధ్యమంగా కోహ్లీ స్పందిస్తూ..‘కోబ్ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. కోర్టులో కోబ్ చేసే విన్యాసాలు చూసి మైమరిచిపోయేవాడిని. జీవితం ఊహించలేనిది. అతడి కుమార్తె కూడా ప్రమాదంలో మరణించిందని తెలిసిన తర్వాత నా హృదయం బ్రద్దలైంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. కోబ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.

More Telugu News