World largest: హైదరాబాదు సమీపంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ‘కన్హా శాంతివనం’!

  • గ్రేటర్ శివారులోని నందిగామలో నిర్మించిన హార్ట్ ఫుల్ నెస్ సంస్థ
  • రేపు బాబా రామ్ దేవ్ చేతుల మీదుగా ప్రారంభం
  • ఒకేసారి లక్షమంది ధ్యానం చేసుకోవడానికి వీలు

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం తెలంగాణలో రేపు ప్రారంభం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ శివారులోని నందిగామ మండలంలో కన్హా శాంతివనం పేర ఈ ధ్యాన కేంద్రం నిర్మాణం అయింది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, హార్ట్ ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్ దాజీతో కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 1400 ఎకరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఏర్పాటు కాగా, 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఒక సెంట్రల్‌హాల్‌, 8 సెకండరీ హాల్స్‌ చొప్పున మొత్తం 9 హాల్స్‌ను నిర్మించారు. ఇందులో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకోవడానికి వీలుంది.

కన్హా శాంతివనం  ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి 40 వేల మంది ధ్యానం చేయనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ మొదటి గైడ్‌ లాల్జీకి ఈ ధ్యానకేంద్రాన్ని అంకితమివ్వనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలు మూడు విడతలుగా సాగుతాయని గ్లోబల్ గైడ్ దాజీ తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు తొలి విడత కార్యక్రమాలు, ఫిబ్రవరి 2 నుంచి 4వరకు రెండో విడత, ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు మూడో విడత కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రేపటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో బాబా రాందేవ్, పలు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. కాగా, ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, 7న సామాజిక కార్యకర్త అన్నా హజారే హాజరు కానున్నారని దాజీ తెలిపారు.

More Telugu News