జగన్ గారూ... ముందుగా మండలికి చెందిన ఇద్దరు మంత్రుల సంగతి తేల్చండి : నారా లోకేశ్

27-01-2020 Mon 12:30
  • నైతిక బాధ్యతగా ముందు వారితో రాజీనామా చేయించండి
  • వైసీపీ ఎమ్మెల్సీల చేత కూడా రాజీనామా చేయించండి
  • ఆ తర్వాత రద్దు గురించి మాట్లాడండి
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ కేబినెట్‌ తీర్మానం చేయడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఉదయం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు.

‘మీకు అసెంబ్లీలో మెజార్టీ ఉంది కాబట్టి రద్దు చేస్తూ తీర్మానం చేయాలని అనుకుంటున్నారు. అంతవరకు ఓకే... అదే సమయంలో మండలి నుంచి మీ మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరి చేత, మీ ఎమ్మెల్సీల చేత, తెలుగుదేశం పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించాలన్న నైతిక బాధ్యత మీకు గుర్తుకు రాలేదా?’ అంటూ లోకేశ్ ప్రశ్నించారు. తక్షణం ఇద్దరు మంత్రులతోను, మీ సభ్యులతోను రాజీనామా చేయించి అప్పుడు మండలి రద్దుపై ఏమైనా మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.