'సీటీమార్' టైటిల్ నే ఖరారు చేసుకున్న గోపీచంద్

27-01-2020 Mon 10:29
  • సంపత్ నంది నుంచి 'సీటీమార్'
  • కబడ్డీ కోచ్ గా గోపీచంద్
  • కథానాయికగా తమన్నా  
గోపీచంద్ కి మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్ విషయంలో సెంటిమెంట్ వుంది. తన సినిమా టైటిల్ సున్నాతో పూర్తయ్యేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. 'లక్ష్యం'.. 'లౌక్యం'.. 'యజ్ఞం'ఇలా ఆయన సినిమాలు సున్నాతో పూర్తవుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సెంటిమెంట్ పనిచేయడం లేదు. చేసిన ప్రతి సినిమా పరాజయాన్ని  చవిచూస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రానికి 'సీటీమార్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేస్తూ తాజాగా పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో గోపీచంద్ రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా తమన్నా కనిపించనుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైనే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు. క్యాచీ టైటిల్ తో వస్తున్న గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతాడేమో చూడాలి.