Sabita Indrareddy: చక్రం తిప్పి... 24 గంటల వ్యవధిలో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిన సబితా ఇంద్రారెడ్డి!

  • ఫలించిన సబిత పాచిక
  • కౌన్సిలర్లకు స్వయంగా ఫోన్
  • కారెక్కిన పలువురు స్వతంత్రులు

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాచిక పారింది. ఒక్క రోజులో తన పరిధిలో బీజేపీ కౌన్సిలర్లు అధికంగా ఉన్న మునిసిపాలిటీల్లో, గులాబీ జెండా ఎగిరేలా, ఆమె చక్రం తిప్పి విజయం సాధించారు. శనివారం నాటికి బడంగ్ పేట, మీర్ పేట మునిసిపాలిటీల్లో హంగ్ పరిస్థితి ఉండగా, 24 గంటలు గడిచేసరికి పరిస్థితి కారుకు అనుకూలమైంది. ప్రత్యర్థులకు స్వయంగా ఫోన్ చేసిన సబితా ఇంద్రారెడ్డి, పలువురిని టీఆర్ఎస్ వైపునకు తిప్పుకున్నారు.

బడంగ్ పేటలో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన పారిజాతా రెడ్డికి చైర్మన్ పదవిని సబిత ఆఫర్ చేయడంతో, ఆమె గులాబీ కండువా కప్పేసుకున్నారు. దీంతో ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో బడంగ్ పేట టీఆర్ఎస్ కైవసమైంది. ఇక మీర్ పేట విషయానికి వస్తే, ఏడుగురు స్వతంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి, వారంతా కారెక్కేలా చేశారు. సబితతో పాటు ఆమె కుమారుడు క్షేత్రస్థాయిలో గెలిచిన కౌన్సిలర్లను కలిసి, టీఆర్ఎస్ వైపు వచ్చేలా చూడటంలో సక్సెస్ అయ్యారు. దీంతో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

More Telugu News