రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రత... అమరావతి పరిధిలోనూ భూ ప్రకంపనలు!

26-01-2020 Sun 08:19
  • గత రాత్రి భూ ప్రకంపనలు
  • గుంటూరు జిల్లాలోనూ గుర్తించిన ప్రజలు
  • ఆర్తనాదాలు చేసిన మూగజీవాలు
గత అర్ధరాత్రి కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో నమోదైన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు ప్రజలకు తెలిశాయే తప్ప, ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని స్పష్టం చేశారు. మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పరిధిలోని పలు గ్రామాల్లోనూ రాత్రి 2.30 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయి.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, వెంకటాయపాలెం, క్రోసూరు, మాచవరం, తుళ్లూరు తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. పెదకూరపాడు, కొత్తపల్లి, బెల్లంకొండ, మాచర్ల తదితర మండలాల్లోనూ ప్రకంపనలను ప్రజలు గమనించారు. జగ్గయ్యపేట, నందిగామ మండలాల్లోనూ భూమి కంపించింది. భూ ప్రకంపనల సమయంలో పక్షులు, మూగజీవాలు ఆర్తనాదాలు చేశాయని ప్రజలు వెల్లడించారు.